ఆస్ట్రేలియాలో చాయ్ వాలీగా ఈమె యమా పాపులర్

ఆస్ట్రేలియాలో చాయ్ వాలీగా ఈమె యమా పాపులర్

రచన 2 తేది 07/09/2016

ఒళ్లు ఉడుకైతే జీరా చాయ్‌. మరీ సలవైతే గరం చాయ్‌ ! ముసుగేస్తే ములక్కాడ చాయ్‌. మనసు బాలేకపోతే మసాలా చాయ్‌. హెడ్డేక్‌ ఉంటే అల్లం చాయ్‌. బోర్‌ కొడితే చాకొలేట్‌ చాయ్‌. ఇలా టీ గురించి చెప్పాలంటే పెద్ద రామకోటే అవుతుంది. అలాంటి భారతీయ బ్రాండ్ తేనీరు విదేశాల్లోనూ యమా క్రేజ్ సంపాదించుకుంది. ఆస్ట్రేలియాలో అయితే మన టిపికల్ ఇండియన్ స్టయిల్ టీకి పెద్ద క్యూ లైనే ఉంది. ఇంతకూ ఎవరా చాయ్ వాలా అనేగా మీ సందేహం? చాయ్ వాలా కాదు.. చాయ్ వాలీ. అవును. ఆమె తయారు చేసిన టీ తాగి ఆస్ట్రేలియన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ కథాకమామీషు ఏంటో మీరే చదవండి.
 
ఉప్మా విర్దీ. పంజాబ్‌లోని జలంధర్ స్వస్థలం. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో ఉంటున్నారు. ఆస్ట్రేలియాలో విర్దీ అనేకంటే చాయ్ వాలీగానే ఆమె పాపులర్ అయ్యారు. నాలుకను లబలబలాడించే భారతీయ తేనేటి రుచిని ఆస్ట్రేలియాకు పరిచయం చేసిన ఘనత ఆమెకే దక్కింది. తాత అప్పట్లో ఆయుర్వేదిక్ డాక్టర్. ఆయన ద్వారానే ఆరోగ్యకరమైన హెర్బల్ టీ చేయడం ఎలాగో నేర్చుకుంది. రెండంటే రెండేళ్లలోనే విర్దీ బ్రాండ్ టీకి అక్కడ విపరీతమైన క్రేజ్ వచ్చింది. సోషల్ సర్కిల్ ద్వారా ఆమె చేసిన చాయ్ కి అందరూ ఫిదా అయిపోయారు. విర్దీ ఎక్కడికి వెళ్లినా టీ చేసివ్వవా అని అడుగుతారట. ఒకసారి తన సోదరుడి పెళ్లికి వచ్చిన కొన్ని వేల మంది అతిథులకు విర్దీ తన మార్క్ టీ చేసి ఇస్తే తాగి మెచ్చుకోని వారులేరు.
 
ప్రస్తుతం విర్దీ చాయ్ బిజినెస్ ఒక రేంజిలో ఉంది. ఇటీవలే సిడ్నీ టీ ఫెస్టివల్ లో విర్దీ తన బ్రాండ్‌ను టీని పరిచయం చేశారు. అంతేకాదు.. అద్భుతమైన టీ ఎలా తయారు చేయాలో అక్కడికి వచ్చిన వారందరికీ నేర్పించారు. కేవలం టీ తయారు చేయడమే కాదు.. ఆన్ లైన్ టీ స్టోర్ కూడా నడుపుతున్నారు. వెరైటీ టీ ప్రాడక్ట్స్ , క్యాండిల్స్, పాట్స్, కెట్టిల్స్, స్టెయినర్స్ అమ్ముతున్నారు. అందులో చాకొలేట్ టీ వెరీ వెరీ స్పెషల్. ఇవి కాకుండా అప్పుడప్పుడూ టీ చేయడంపై వర్క్ షాప్ కూడా కండక్ట్ చేస్తారు. ఔత్సాహికులకు ఏలకుల వంటి సుగంధ ద్రవ్యాలను వేసి పరిమళభరితమై తేనీరు తయారు చేయడమెలాగో నేర్పిస్తారు.
 
విర్దీ చాయ్‌వాలీగా ఆస్ట్రేలియాలో సంచనలమైంది. ఆమెకు 2016కు గానూ విర్దీకి బిజినెస్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా వచ్చింది. అంత ఇష్టంగా తాగే టీ మరింత గొప్పగా ఉండాలన్నదే ఉప్మా విర్దీ లక్ష్యం. భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన తేనీటిని ప్రపంచమంతా తెలియజేయాలి అన్నదే తన లక్ష్యమని అంటారామె.