క్యాబ్ డ్రైవర్ రాసిన ఆ లెటర్ హృదయాంతరాల్లోకి వెళ్లి ఆలోచింపజేస్తోంది ..?

క్యాబ్ డ్రైవర్ రాసిన ఆ లెటర్ హృదయాంతరాల్లోకి వెళ్లి ఆలోచింపజేస్తోంది ..?

రచన ఆరవింద్ తేది 22/09/2016

ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా ఎక్కడో చోట అత్యాచార వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. దాంతో మహిళలు క్యాబ్ అంటేనే హడలిపోతున్నారు. దీన్ని అవమానంగా భావించిన ఢిల్లీ ఓ క్యాబ్‌ డ్రైవర్‌ తన సహచరులకు ఒక ఉత్తరం రాశాడు. అయితే అది సాదా సీదా లెటర్ కాదు. అతను రాసిన ప్రతీ అక్షరం చదివిన ప్రతీ ఒక్కరి హృదయాంతరాల్లోకి వెళ్లి ఆలోచింపజేస్తోంది. సోషల్‌ మీడియాలో అతను రాసిన లేఖ వైరల్‌గా మారింది. అదేంటో మీరూ చదవండి.
 
ప్రియమైన సోదరీ సోదరులారా..
 
నేను సాధారణ క్యాబ్ డ్రైవర్‌ని మాత్రమే. సూక్తులు చెప్పేంత పెద్దవాణ్ని కాదు. ఎందుకంటే నేను గొప్పగా చదువుకోలేదు. అనుభవం కూడా లేదు. నీతులు చెప్తున్నాను అని అనుకోనంటే.. చిన్న సందేశం ఇస్తాను. దయచేసి ఈ ఉత్తరాన్ని పదిమందికీ చూపించండి.
 
నేను ఢిల్లీకి వచ్చి దాదాపు 10 ఏళ్లు కావొస్తోంది. ఒక రంగుల ప్రపంచాన్ని ఊహించుకుంటూ ఇక్కడ అడుగుపెట్టాను. 22 ఏళ్ల వయసప్పుడే పొట్టచేత పట్టుకుని ఇల్లు వదిలిపెట్టాను. బహుశ నాకు తెలిసి ఆ సమయంలో నా వయసు వాళ్లెవరూ మా ఊరినుంచి బయటకు రాలేదు. మాది ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా. మా నాన్న దినసరి కూలీ. ఇంటిల్లిపాదికీ నాలుగు వేళ్లు నోట్లోకి పోవడమే గగనం. పేద బతుకులు. ఎలాగోలా ముక్కీ మూలిగీ పదో క్లాస్ అయిందనిపించాను. ఆ తర్వాత కొద్ది రోజులు వ్యవసాయమనీ, మిషన్ వర్కనీ, ఆ పనీ ఈ పనీ చేశాను. అదృష్టంకొద్దీ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. అందులో పర్ ఫెక్ట్ అయ్యాను. నా మీద నమ్మకంతో నాన్న నన్ను ఢిల్లీ రైలెక్కించాడు. బయల్దేరేటప్పుడు నా మనో ఫలకం ఢిల్లీ తళుక్కున మెరిసింది. ఏవేవో రంగుల కలలు. ఎడతెగని ఊహలు. ఫైనల్ గా దేశరాజధానిలో కాలుమోపాను. ఆశ్చర్యం. ఇక్కడ మనుషులు ఒకరినొకరు పలకరించుకోరు. ఎవరినీ ఎవరూ పట్టించుకోరు. ఉదయం నుంచీ పరీక్షగా చూశాను. అర్ధరాత్రయినా ఎవరూ ఎవరినీ పలకరించరే.. చుట్టూ మనుషులున్నారు గానీ ఒక్కరూ మాట్లాడరే..! నిజంగా ఆశ్చర్యమేసింది!!
 
ఎలాగోలా కష్టపడి క్యాబ్ డ్రైవర్ గా ఉద్యోగం సంపాదించాను. డ్రైవింగ్ మొదలైన మొదటి రోజే బిత్తరపోయాను. ముఖ్యంగా ఢిల్లీ అమ్మాయిలు. వాళ్లు గట్టిగట్టిగా మాట్లాడే తీరుకి కంగారు పడిపోయాను. ఖర్మకాలి టర్న్ తీసుకోవడం మరిచిపోయినా, చిల్లర లేదు మేడం అన్నా.. వాళ్లు వినరు. మీద పడి కరిచినంత పనిచేస్తారు. నువ్వు.. అని ఏకవచనంతో సంబోంధిస్తారు. అప్పుడనిపించేది నా ఊరికి ఇక్కడికీ ఎంత తేడా అని. అక్కడైతే అమ్మాయి అబ్బాయి పొరపాటున కూడా పక్కపక్కన నడవరు. కనీసం నడిచే ధైర్యం కూడా చేయరు. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నం. ఇక్కడి కల్చర్, ఇక్కడి సంస్కృతి, కట్టుబొట్టు చూసి షాకయ్యాను. మగవాళ్లతో ఎంతైనా వాగ్వాదానికి దిగొచ్చు. కానీ ఢిల్లీ అమ్మాయిలతో అలా కుదరదు.  
 
ఒక్కోసారి లేట్ నైట్ పికప్స్ ఉంటాయి. ఆ టైంలో అమ్మాయిలు చిన్నచిన్న బట్టల్లో కనిపిస్తారు. అలాగే క్యాబ్ ఎక్కుతారు. ముందు సీట్లో వాళ్లు కంఫర్ట్‌ గానే కూర్చుంటారు. కానీ ఎటొచ్చీ డ్రైవింగ్ సీట్లో ఉన్న నా పరిస్థితే అయోమయంగా ఉంటుంది. వీళ్లేంటి.. ఈ అవతారమేంటి.. అని మనసులో తిట్టుకునేవాడిని. బాధపడేవాడిని.