తమిళనాడు అంతా అమ్మమయం..!!

తమిళనాడు అంతా అమ్మమయం..!!

రచన 3 తేది 07/09/2016

ప్రభుత్వం చేపట్టే ఏ పథకమైనా, ఏ కార్యక్రమమైనా అన్నీ అమ్మ పేరుతోనే. పేదల ఆకలి తీర్చడం మొదలు.. అమ్మాయిల పెళ్లి వరకు ప్రతి విషయంలోనూ అమ్మలాగే ఆదరించింది. ప్రచారం కోసం కాకుండా ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసింది. అందుకే అమ్మంటే తమిళులకు అంత ప్రేమ.
 
తమిళనాడు అనగానే అందరికీ గుర్తొచ్చేది అమ్మ... ఆమె ప్రవేశపెట్టిన పథకాలే. వరుస విజయాలతో పాలనలో దూసుకుపోతూ ఎప్పటికప్పుడు కొత్త పథకాలు ప్రవేశపెట్టడమే గాక, వాటిని సక్రమంగా అమలుచేస్తూ జనాల మనసుల్లో స్థానం సుస్థిరం చేసుకున్నారు జయలలిత. తమిళనాడులో ఏ పథకం రూపొందించినా, ఏ కార్యక్రమం అమలు చేసినా అన్నీ అమ్మ పేరుతోనే. అయితే ఇందులో ప్రచార ఆర్భాటం కన్నా... ప్రజా సంక్షేమమే ప్రాధాన్యంగా కనిపిస్తుంది. అమ్మ బ్రాండ్‌ పథకాల గురించిన ప్రస్తావన వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది అమ్మ క్యాంటీన్‌. తక్కువ ధరకే టిఫిన్‌, భోజనం అందించి పేదవాడి ఖాళీ కడుపు నింపడమే ఈ పథకం లక్ష్యం. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో అమ్మ క్యాంటీటన్లలో ప్లేటు ఇడ్లీ రూపాయి, పెరుగన్నం మూడు, సాంబారన్నం ఐదు రూపాయలే అందిస్తూ జనం ఆకలి తీరుస్తున్నారు. ఎన్నో రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని ఇలాంటి పథకాలనే అమలుచేస్తున్నాయంటే అమ్మ క్యాంటీన్లకున్న ఆదరణ గురించి తెలుసుకోవచ్చు.
 
అమ్మ కుడినీర్‌. దాహంతో ఉన్నవారి దప్పిక తీర్చడమే ఈ పథకం ఉద్దేశం. ఈ స్కీంలో భాగంగా లీటర్‌ వాటర్‌ బాటిల్‌ను 10 రూపాయలకే అందిస్తూ జనం దాహం తీరుస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు కొత్త పథకాలు ప్రకటించిన జయ.. పాలనాపగ్గాలు అందుకున్నాక వాటిని అమలు చేయడమే కాదు.. కొత్తవాటినీ ప్రవేశపెట్టి జనానికి మరింత దగ్గరయ్యారు. పేదవాడి సొంతింటి కల నిజం చేసుకునేందుకు తనవంతు సాయం అందించారు. అమ్మ సిమెంట్‌ స్కీంతో అతి తక్కువ ధరకే సిమెంట్‌ అందించి ఇంటి నిర్మాణ వ్యయాన్ని భారీగా తగ్గించారు. ఇక పెరిగిపోతున్న మందుల ధరలతో ప్రజలు ఇబ్బంది పడకూడదని తక్కువ ధరలకే వాటిని అందించేందుకు అమ్మ మెడికల్‌ షాపులు అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు... కూరగాయలు, పండ్ల దుకాణాలు, కిరాణా షాపులు, చివరకు ఉప్పును కూడా అమ్మ బ్రాండ్ తో తక్కువ ధరకే అందించి ప్రతి ఒక్కరి కడుపు నింపే ప్రయత్నం చేశారు. పేదలు తలదాచుకునేందుకు నీడ కల్పించాలన్న ఉద్దేశంతో పురిచ్చితలైవి 18వందల కోట్ల వ్యయంతో అమ్మ పేరుతో 50వేల ఇళ్లు నిర్మించాలని ఆదేశించారు.