
దొంగలకు తాళాలివ్వడమంటే ఇదే.. !
రచన Konda Vipani తేది 22/09/2016
ఒకపక్క సామాన్య ప్రజలకు రెండున్నర వేలు దొరకడమే గగనమవుతుంటే మరోపక్క బ్యాంకర్లు దొడ్డిదారిన బడాబాబులకు డబ్బు సంచులు తరలిస్తున్నారు. ఈ ముఠాలో ఏకంగా ఆర్బీఐ ఆఫీసర్లే ఉండటం సిగ్గుపడాల్సిన విషయం. లాగినాకొద్దీ నోట్ల కట్టల డొంకలు ఎక్కడెక్కడో కదులుతున్నాయి. వీళ్ల తీరు చూస్తుంటే బ్యాంకింగ్ వ్యవస్థ మీదనే జనానికి నమ్మకం పోతోంది.
డిసెంబర్ 10న సీబీఐ అరెస్టు చేసిన కేసీ వీరేంద్ర బెంగళూరుకు చెందిన ఒక క్యాసినో యజమాని. అతని బాత్రూంలో పెద్ద భోషాణమే వుంది. సీక్రెట్ అల్మరాలో దాచిన రూ. 5.70 కోట్ల నగదు, బంగారం, ఆభరణాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. అతణ్ని సీబీఐ కోర్టులో ప్రేవేశపెట్టి వారంపాటు కస్టడీలోకి తీసుకున్నారు. తిప్పేస్వామి, వెంకటేశ్ అనే మధ్యవర్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్లతో పాటు ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రాకు చెందిన కొందరు బ్యాంకు అధికారుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. వీళ్లంతా కుమ్మక్కై అడ్డదారిలో నగదు మార్పిడి చేశారని రుజువైంది.
డిసెంబర్ 10న వీరేంద్రకు చెందిన ఇళ్లు, ఆఫీసులు, క్లబ్బలు ఇలా మొత్తం 15 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. హవాలా వ్యాపారం చేసే వీరేంద్రపై క్రికెట్ బెట్టింగ్ కేసులు కూడా నడుస్తున్నాయి. కొన్ని చిట్ ఫండ్ బిజినెస్ లు కూడా ఉన్నాయని తేలింది. ఇవే కాదు.. వీరేంద్ర ప్రైమరీ లాండ్ డెవలప్మెంట్ బ్యాంకుకు మాజీ ఛైర్మన్ కూడా.
మరో ఆర్బీఐ అఫీషియల్ మైఖేల్ కూడా గతవారం సీబీఐ దాడుల్లో దొరికిపోయాడు. రూ. 1.51 కోట్ల నగదు మార్పిడిలో అక్రమాలకు పాల్పడి అడ్డంగా బుక్కయ్యడు. అతను ఆర్బీఐలో సీనియర్ స్పెషల్ అసిస్టెంట్.
ఒకపక్క సామాన్య ప్రజలు బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ తిరగలేక నానా చావు చస్తుంటే బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులు లొసుగులను అడ్డం పెట్టుకుని వెనుక గేటు నుంచి నగదు దాటవేస్తున్నారు. సీబీఐ దాడుల్లో వీళ్లు దొరికిపోతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. దొంగలకు తాళాలివ్వడమంటే ఇదే మరి.
Comments
No Comments FoundLeave your comment
మీ సలహాలు వ్రాయడానికి ఖాతాలోకి ప్రవేశించండి