ఆన్ లైన్ చెల్లింపుల బాటపట్టిన ఆదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామం

ఆన్ లైన్ చెల్లింపుల బాటపట్టిన ఆదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామం

రచన శ్రీకాంత్ తేది 19/09/2016

నోట్ల రద్దు సంక్షోభం నుంచి బయటపడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు డిజిటల్ బాట పడుతున్నారు..! ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ దిశగా వడివడిగా అడుగులేస్తున్నారు..! ఇప్పటికే సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ రాష్ట్రంలో తొలి నగదు రహిత గ్రామంగా రికార్డ్ సృష్టించింది..! ఇబ్రహీంపూర్ స్ఫూర్తితో ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రాకే గ్రామం కూడా డిజిటల్‌ విలేజ్‌గా రూపుదిద్దుకుంటోంది..!
 
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో కరెన్సీ ఎమర్జెన్సీ తలెత్తింది. ఎక్కడ చూసినా జనం చిల్లర కష్టాలతో సతమతమవుతున్నారు. ఏటీఎంల ముందు క్యూలు... బ్యాంకులో విత్‌డ్రా కోసం తంటాలు... రెండు వేల నోటుకు చిల్లర తిప్పలు తప్పడం లేదు..! నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న ఈ కష్టాలకు నగదు రహిత విధానమే శరణ్యమని ప్రభుత్వం భావించింది. 
 
అందుకే డిజిటల్‌ ట్రాన్సాక్షన్‌ దిశగా ప్రజల్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహిత నియోజకవర్గంగా మార్చే దిశగా శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ మండలం తొలి క్యాష్‌ లెస్‌ విలేజ్‌గా రికార్డు కెక్కింది. అదే స్ఫూర్తితో రాష్ట్రంలోని మరిన్ని గ్రామాలు డిజిటల్ బాట పడుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు కూడా ఆన్‌లైన్‌ లావాదేవీలకు మారుతున్నారు.
 
ముక్రాకే గ్రామానికి ఇప్పటికే ఓ ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో వందశాతం డిజిటల్ అక్షరాస్యత సాధించిన నాలుగో గ్రామంగా రికార్డు సృష్టించింది. 160 కుటుంబాలున్న ఈ గ్రామంలో మొత్తం జనాభా 650. ఐక్యమత్యానికి ముక్రాకే గ్రామస్తులు కేరాఫ్ అడ్రస్. అందుకే ఎలాంటి సమస్య వచ్చినా అందరూ సమావేశమై ఒక నిర్ణయం తీసుకుని దాన్ని పాటిస్తారు. ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివించాలని తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉన్నారు. అదే విధంగా కంప్యూటర్ విద్యపై అందరూ అవగాహన పెంచుకుని తమ ఊరిని డిజిటల్‌ విలేజ్‌గా మార్చుకున్నారు.
 
పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా వేధిస్తున్న నగదు సమస్యను పరిష్కరించుకునే దిశగా ముక్రాకే గ్రామస్తులు కలిసికట్టుగా అడుగులేశారు. అందరూ కలిసి సమావేశమై డిజిటల్ ట్రాన్సాక్షన్‌ ఒక్కటే మార్గమని తీర్మానించారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్న సంస్థల సహకారం తీసుకున్నారు. స్వైపింగ్ మెషీన్ వాడకం, మొబైల్‌ వ్యాలెట్ చెల్లింపులు, పేటీఎం వాడకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకున్నారు. గ్రామంలో ఉన్న కిరాణా షాపుల్లో కూడా మొబైల్ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో ఉన్న 160 కుటుంబాల్లో కూడా ఆండ్రాయిడ్ ఫోన్ల సదుపాయం ఉండటంతో పని సులభమైంది.