ఒక మనసున్న కాంట్రాక్టర్ తన కూతురి పెళ్లి ఎలా చేశాడంటే..?

ఒక మనసున్న కాంట్రాక్టర్ తన కూతురి పెళ్లి ఎలా చేశాడంటే..?

రచన ఆరవింద్ తేది 22/09/2016

బేసిగ్గా కాంట్రాక్టర్లంటే ఎలా వుంటారు! వైట్ అండ్ వైట్ డ్రస్‌.. చెమట చిందకుండా ఎక్కే కారు.. దిగే కారు.. సంచీ నిండా చెక్కు బుక్కులు.. సూట్ కేసు నిండా నోట్ల కట్టలు.. మాగ్జిమం ఫోన్లోనే డీల్ సెట్ చేస్తూ.. నిత్యం రాజకీయ నాయకులతో టచ్‌లో ఉంటూ .. నోరు విప్పితే కరెన్సీ లాంగ్వేజీలోనే మాట్లాడుతూ.. అబ్బో వాళ్ల దర్జాయే వేరు. అలాంటి డబ్బున్న బడా కాంట్రాక్టర్ ఇంట్లో బర్త్ డే పార్టీ అంటేనే దుమ్మురేగిపోద్ది. 
 
మరి అలాంటిది కూతురు పెళ్లంటే ఇంకెలా ఉంటుంది? ఖద్దరు చొక్కాలు.. వీఐపీలు, బుగ్గకార్లు, సినిమాతారల తళుకు బెళుకులు.. ఫుడ్డు.. లిక్కరు.. డాన్సులు.. ఆ హంగామే వేరు.అయితే అలాంటివేవీ లేకుండా ఒక డబ్బున్న కాంట్రాక్టర్ తన కూతురి మ్యారేజ్ చేశాడు. పైసల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుపెట్టకుండా వాటిని ఒక మంచి పనికి ఉపయోగించాడు. ఇంతకూ ఏంటా మంచి పని..?
 
మనోజ్ మునోట్ అని ఔరంగాబాద్‌లో పేద్ద బిజినెస్ మేన్. పేరు మోసిన కాంట్రాక్టర్ కూడా. కోటీశ్వరుడు అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. ఇటీవలే కూతురి పెళ్లి ఫిక్సయింది. బ్రహ్మాండంగా జరిపించాలని ప్లాన్ చేశాడు. ఎక్కడా తగ్గొద్దని డిసైడయ్యాడు. కమ్ సే కమ్ 70-80 లక్షలు ఖర్చు చేయాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని దగ్గరి మిత్రుడైన స్థానిక ఎమ్మెల్యేకు చెప్పాడు. భయ్యా ఇదీ సంగతి.. అమ్మాయి పెళ్లి ఇలా చేద్దామనకుంటున్నాను అని మనసులో మాట ప్రస్తావించాడు.
 
అందుకు ఆ ఎమ్మెల్యే ఎగాదిగా చూసి ఇలా అన్నాడు.. చూడు మిస్టర్ మనోజ్‌.. ఏ తండ్రయినా కూతురి పెళ్లి ఘనంగా చేయాలనే అనుకుంటాడు. నువ్వూ అంతే. కాదనను. డబ్బున్నోడివి కాబట్టి నీ తాహతుకు తగ్గట్టు 70-80లక్షలు ఖర్చు పెడతానంటున్నావు.. వేలమందిని పిలిచి మంచి భోజనాలవీ వడ్డిస్తావు. నీ కుమార్తె వివాహం జరిగిన తీరు గురించి జనం రెండు రోజులు.. మూడు రోజులు.. చర్చించుకుంటారు. మహా అయితే ఒక వారం మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మరిచిపోతారు. కానీ అలా కాకుండా ఉండాలంటే నీకొక సలహా ఇవ్వనా అన్నాడు. ఏంటో చెప్పండన్నా అని మనోజ్ అన్నాడు.
 
 
కట్ చేస్తే.. బిడ్డ పెళ్లికి ముందే మనోజ్ గూడులేని నిరుపేదలకు ఒక 90 ఇళ్లు కట్టివ్వడానికి సిద్ధపడ్డాడు. ఆగమేఘాల మీద 40 పూర్తి చేసి పేదవారికి కానుకగా ఇచ్చాడు. మిగతావి పూర్తికావొస్తున్నాయి. వాటి ఖర్చు కోటిన్నర దాటింది. ఎమ్మెల్యే సలహా మేరకు తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని కూతురు మిక్కిలి సంతోషించింది. ఇంతకు మించిన గిఫ్ట్ జీవితంలో మరోటి ఉండదని ఆమె గర్వంగా చెప్తోంది.
 
ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులున్నారంటే ఆశ్చర్యమేస్తోంది కదా! డబ్బులు.. రాజకీయ నాయకులు.. ఈ రెండు మాటలు తప్ప వేరే ప్రపంచం గురించే పట్టించుకోని కాంట్రాక్టర్లు.. కూతురు పెళ్లికి అయ్యే డబ్బుల్ని పేదలకోసం ఖర్చు చేయడమంటే మాటలు కాదు.
 
పొయిన నెలలోనే చూశాం.. గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి ఏ స్థాయిలో జరిగిందో! ఒక పక్క చేతిలో చిల్లిగవ్వా లేక దేశమంతా లబోదిబోమని మొత్తుకుంటుంటే.. గాలి ఘనులవారు మాత్రం బిడ్డ పెళ్లిని బీభత్సంగా చేశాడు. ప్రస్తుతానికి బెంగళూరు జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లి అదేనట. పొయిన వారమే ఇదే ఇంచుమించు రేంజిలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూతురి పెళ్లి కూడా జరిగింది.