ఒకప్పుడు రూ.15 దినసరి కూలీ.. ఇప్పుడు రూ.1600 కోట్ల కంపెనీకి అధిపతి..!

ఒకప్పుడు రూ.15 దినసరి కూలీ.. ఇప్పుడు రూ.1600 కోట్ల కంపెనీకి అధిపతి..!

రచన 2 తేది 05/09/2016

రోజుకి పదిహేను రూపాయలు సంపాదించే డైలీ లేబర్ జీవితం పదేళ్ల తర్వాత ఎలా ఉంటుంది? దీన్ని ఊహించడానికి పెద్దగా లెక్కలు రావాల్సిన అవసర లేదు! నడిచివెళ్లేవాడు మహా అయితే సైకిల్ కొంటాడు. ఒక జత బట్టలుంటే- రెండు జతలవుతాయి! పొద్దున టీ మాత్రమే తాగేవాడు టిఫిన్ కూడా తింటాడు! అంతకు మించి ఏం అక్కడ జరిగేదేం లేదు! అయితే మీరు చదవబోయే సుదీప్ సక్సెస్ స్టోరీ అలాంటి రొటీన్ కథ కాదు. అంతకుమించి అద్భుతం జరిగింది.
 
సుదీప్ నాన్న ఆర్మీలో పనిచేసేవాడు. 1971లో వచ్చిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లో కాలికి తీవ్రగాయమైంది. బుల్లెట్ దిగబడి కాలుమొత్తం పెద్దపుండులా మారింది. అది క్రమంగా పక్షవాతానికి దారితీసింది. మంచానికే పరిమితమైపోయాడు. మూడు నెలలు అవస్థపడి కన్నుమూశాడు.
 
అదేంటోగానీ కష్టాలన్నీ కట్టగట్టుకుని ఒకదానవెంట ఒకటి వస్తాయి. తండ్రికోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న కుటుంబానికి మరో షాక్ తగిలింది. అన్నకు ఏదో జబ్బు చేసింది. వైద్యం చేయించే స్తోమత లేదు. పాపం అతను కూడా కొద్దిరోజులకే చనిపోయాడు. ఇంటికి పెద్దదిక్కు అవుతాడనుకున్న సోదరుడూ దూరం కావడంతో అంతులేని కుటుంబం కుప్పకూలిపోయింది. అప్పటికి సుదీప్ వయసు 16 ఏళ్లు. అమ్మతోపాటు తోడబుట్టినవాళ్లు ఇంకా నలుగురు ఉన్నారు. వాళ్లందరిని పోషించే బాధ్యత సుదీప్ మీద పడింది. ఇంజినీరింగ్ చదవాలన్న అతడి కలలన్నీ కూలిపోయాయి. కొండంత బరువును భుజాన వేసుకున్నాడు.
 
రిక్షా లాగాలా..? హోటల్ లో వెయిటర్‌గా మారాలా..? కాదు.. ఇవీవే కాదు.. ముంబై వెళ్లాలి. అక్కడే మంచి ఉద్యోగం వెతుక్కోవాలి! మనసు దుర్గాపూర్‌లోనే (పశ్చిమబెంగాల్) ఉండటానికి ఇష్టపడలేదు. సిటీ ఆఫ్ డ్రీమ్స్ ముంబై రారమ్మని పిలుస్తోంది. ఇక ఎక్కువ ఆలోచించడం వేస్ట్ అనుకున్నాడు. బట్టలు సర్దుకుని రైలెక్కాడు.
 
 
ముంబై మహానగరం. బతకడం అంత ఈజీ కాదు. రెండ్రోజుల్లోనే సుదీప్‌కు తెలిసొచ్చింది. ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. ఒక రూం తీసుకున్నాడు. ఆల్రెడీ అందులో 20మంది ఉన్నారు. ఉండేచోటు నుంచి ఫ్యాక్టరీకి 40 కిలోమీటర్ల దూరం. బస్సులో వెళ్తే ఉన్న జీతం చార్జీలకే సరిపోతుంది. అందుకే రోజూ నడిచివెళ్లేవాడు. మిగిలిన డబ్బుల్ని ఇంటికి పంపేవాడు.
 
రెండేళ్లు గడిచిపోయాయి. పనిచేస్తున్న ఫ్యాక్టరీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. మూసేద్దామని ఓనర్ డిసైడయ్యాడు. విషయం తెలిసిన సుదీప్ ఏదో అవకాశం తలుపుతడుతున్నట్టు అనిపించింది. ఫ్యాక్టరీ ఓవర్ టేక్ చేస్తే ఎలా వుంటుందని ఆలోచించాడు. నిద్రలేదు.. తిండిలేదు.. ఎలా..ఎలా.. ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ వస్తుందా..?కొంటాం సరే.. అసలే నష్టాల్లో ఉంది కదా.. ఉంటే ఉన్నది ముందు కంపెనీ చేతిలోకి రానీ.. చెప్పలేనంత మానసిక సంఘర్షణ.. ఎలాగోలా ధైర్యం చేసి యజమానిని అడిగాడు. కంపెనీ ఇచ్చేయమని ప్రపోజల్ పెట్టాడు. ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఫైనల్ ఫిగర్ 16వేలు. దాంతోపాటు వచ్చిన లాభాల్లో వాటా. ఇదీ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం.
 
వాస్తవానికి ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో గుత్తాధిపత్యం రాజ్యమేలుతోంది. ఫాయిల్స్, జిందాల్ లిమిటెడ్ వ్యాపార దిగ్గజాలంతా మార్కెట్‌ని దున్నేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని సుదీప్ ఆలోచనలో పడ్డాడు. కంపెనీ కొని తప్పు చేశానా అనుకున్నాడు. అడుగు పడిన తర్వాత వేరే ఆలోచనే చేయొద్దని భావించాడు. మొదట ఫార్మస్యూటికల్ సెక్టార్ పై దృష్టి సారించాడు. కంపెనీల ఫ్లెక్సిబుల్ ప్యాకేజీ అవసరాలను వీలైనంత వేగంగా తీర్చాడు. అలా అనతికాలంలోనే నష్టాల్లో ఉన్న కంపెనీ కాస్తా.. మిడ్-క్యాప్ కంపెనీగా మారింది. అయితే అతని లక్ష్యం దాన్ని లార్జ్-క్యాప్ కంపెనీ చేయడం మాత్రమే కాదు.. యునీలివర్, పీ అండ్ జీ కంపెనీల్లా మల్టీనేషన్ స్థాయికి ఎదగాలి. అదీ సుదీప్ లక్ష్యం.
 
అనుకున్నట్టే 2008లో వేదాంత గ్రూపు నుంచి ఫాయిల్స్ కంపెనీని రూ.130 కోట్లకు కొనుగోలు చేశాడు. అప్పటికే సుదీప్ కంపెనీ ఎస్‌డీ అల్యుమినియం చాలా చిన్నది. ఈ కొనుగోలుతో ఒక్కసారిగా కెపాసిటీ పెరిగింది. ఏడాదికి 18వేట టన్నులకు చేరింది. ఈ దెబ్బతో గ్లోబల్ దిగ్గజం వేదాంత గ్రూప్ ఇండస్ట్రీ నుంచి పూర్తిగా వైదొలగింది. ఒక్కసారిగా సుదీప్ కంపెనీ ప్యాకేజింగ్ మార్కెట్లో అగ్రగామిగా నిలబడింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఊహించని గ్రోథ్‌. కంపెనీ ఎస్కలేటర్ ఎక్కి నిలబడింది. ఏడాది తిరిగేసరికి రూ.1600 కోట్ల టర్నోవర్ కళ్లముందు కనిపించింది.
 
ఇవాళ సుదీప్ రన్ చేస్తున్న ఎస్ డీ అల్యూమినియం కంపెనీ వాల్యూ అక్షరాలా రూ. 1685 కోట్లు. ఫార్మా ఇండస్ట్రీలో తిరుగులేని ప్యాకేజింగ్ కంపెనీ. మాండెలిజ్ ఇండియా, పర్ఫెట్టి వాన్ మిల్లే, నెస్లీ, సిప్లా, సన్ ఫార్మా కంపెనీలకు మాగ్జిమం సొల్యూషన్స్ చూపిస్తోంది.
 
కష్టాలన్నీ నెత్తిన కూలి, ఇంటిల్లిపాదినీ ఎలా సాకాలనే గుండె బరువుతో ముంబై చేరిన ఓ కుర్రాడు డైలీ లేబర్ నుంచి కోటీశ్వరుడయ్యాడంటే.. నిజంగా నమ్మశక్యం కాదు. గెలుపంటే ఇదీ. సక్సెస్ అంటే ఇదీ.