ఒకప్పుడు పిజా డెలివరీ చేసిన కుర్రాడు.. నేడు న్యూస్ ఛానల్ నడిపిస్తున్నాడు!!

ఒకప్పుడు పిజా డెలివరీ చేసిన కుర్రాడు.. నేడు న్యూస్ ఛానల్ నడిపిస్తున్నాడు!!

రచన 2 తేది 03/09/2016

న్యూస్ ఛానల్ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీని తట్టుకోవాలి. సమకాలీన రాజకీయాలను అవగాహన చేసుకోవాలి. మినిట్ టు మినిట్ వార్తలు జనానికి చేరవేయాలి. ఆ ప్రయాణంలో ఎన్నో సాధకబాధకాలు. మరెన్నో సవాళ్లు. వాటని అధిగమించాలంటే ముందు కావల్సినంత డబ్బు చేతిలో ఉండాలి. విటమిన్ ఎం లేకుండా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఫలితం లేదు. డబ్బుతో ముడిపడివున్న మీడియా వ్యవస్థలో.. ఒక పిజా డెలివరీ చేసే కుర్రాడు ఛానల్ స్థాపించాడంటే నిజంగా వండర్. అతని గట్స్‌ ని మెచ్చుకోవాలి.
 
మహ్మద్ హుసేన్‌. పుట్టిపెరిగిందంతా కార్గిల్‌లో. క్షణక్షణం టెన్షన్ టెన్షన్‌గా ఉండే ప్రాంతం. కొండలు.. గుట్టలు.. తుపాకీ చప్పుళ్లు.. ఆర్మీ వాహనాల మోత.. నిత్యం యుద్ధవాతావరణం కనిపిస్తుందక్కడ. హుసేన్ స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్లో పిజా డెలివరీ బోయ్ గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అలా పనిచేస్తూనే చదువు కంటిన్యూ చేశాడు.
 
2011లో ఫ్రెండ్ ఫెరోజ్‌ ఖాన్ తో కలిసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. దానిపేరు కార్గిల్ టుడే. అలా మొదలైన ప్రస్థానం మెల్లిగా కేబుల్ చానల్‌గా మారింది. స్థానిక సమస్యలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అతి తక్కువ కాలంలోనే ఛానల్ కు మంచి ఆదరణ లభించింది.
 
ఇప్పుడు కార్గిల్ టుడే ఛానల్- లడఖ్‌, కార్గిల్ ఏరియాలో బలమైన గొంతు వినిపించే మీడియా హౌజ్. జనం సమస్యల తరుపు మాట్లాడుతూ వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా జనం కార్గిల్ టుడేకి మొరపెట్టుకుంటున్నారు. తమకోసం కొట్లాడే ఒక మీడియా సంస్థ వుందన్న భరోసాతో అధికారులను, అవినీతిని ప్రశ్నిస్తున్నారు. ఆరోజు మేం ధైర్యంతో తీసుకున్న నిర్ణయం నేడు ప్రజల గుండె గొంతుక కావడం ఆనందంగా ఉందని హుసేన్ గర్వంగా చెప్తున్నాడు. ఎన్ని సమస్యలొచ్చినా వెనుదిరగకుండా ఒక సక్సెస్ ఫుల్ చానల్ నడిపిస్తున్నామని విజయదరహాసంతో చెప్తున్నాడు.